Smartphone Prices : కొత్త మొబైల్ కొనేవారికి బిగ్ షాక్.. భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ ధరలు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ ధరలు
Smartphone Prices :స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్న మొబైల్ ప్రియులకు ఒక బ్యాడ్ న్యూస్. భారత మార్కెట్లో మొబైల్ ఫోన్ల ధరలు నిరంతరం పెరిగిపోతుండటం ఇప్పుడు అటు కస్టమర్లను, ఇటు స్మార్ట్‌ఫోన్ కంపెనీలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. రాబోయే పండగల సీజన్‌లో కొత్త ఫోన్ కొనాలనే ఆలోచనను సగానికి పైగా జనాలు విరమించుకునే పరిస్థితి కనిపిస్తోంది. ప్రముఖ టెక్ సంస్థలు ట్రాకిన్ టెక్, టెక్ ఆర్క్ సంయుక్తంగా నిర్వహించిన తాజా సర్వే నివేదికలో ఈ షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఫోన్ల రేట్లు ఇలాగే పెరిగితే మార్కెట్లో కొత్త ఫోన్ల అమ్మకాలు భారీగా పడిపోయి.. సెకండ్ హ్యాండ్ మొబైల్స్ మార్కెట్ ఊపందుకునే ఛాన్స్ ఉందని ఈ రిపోర్ట్ చెప్తోంది.
పండగ సీజన్ ఆశలపై నీళ్లు..
సాధారణంగా ప్రతి ఏటా జూలై నుంచి డిసెంబర్ వరకు వచ్చే పండగల సీజన్‌లో మొబైల్స్ అమ్మకాలు జోరుగా సాగుతుంటాయి. కానీ ఈ ఏడాది సీన్ రివర్స్ అయ్యేలా ఉంది. టెక్ ఆర్క్ సర్వే ప్రకారం.. దేశవ్యాప్తంగా దాదాపు 5,958 మంది పొటెన్షియల్ బయ్యర్లపై నిర్వహించిన సర్వేలో విస్తుపోయే నిజాలు తెలిశాయి. రాబోయే ఆరు నెలల్లో కొత్త ఫోన్ కొనాలనుకుంటున్న వారిలో ఏకంగా 54 శాతం మంది కస్టమర్లు తమ నిర్ణయాన్ని మార్చుకునే యోచనలో ఉన్నారు. ధరలు విపరీతంగా పెరగడం వల్ల బడ్జెట్ దాటిపోతోందని, అందుకే ప్లాన్ వాయిదా వేస్తున్నట్లు వారు చెప్తున్నారు.
మొబైల్స్ రేట్లు పెరగడానికి అసలు కారణం ఇదే
గత ఏడాది జనవరి 2025 నుంచి ఇప్పటివరకు (మే 2026) స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ పలు పాపులర్ మోడల్స్ ధరలను వరుసగా పెంచుకుంటూ పోయాయి. దీనికి అతిపెద్ద కారణం అంతర్జాతీయంగా నాండ్ ఫ్లాష్ (NAND Flash), డిరామ్ (DRAM) మెమొరీ చిప్స్ ధరలు విపరీతంగా పెరిగిపోవడమే. మొబైల్ ఫోన్లలో స్టోరేజ్, ర్యామ్ (RAM) పనితీరుకు ఈ చిప్స్ అత్యంత కీలకం. ఈ ధరల పెంపు ప్రభావం ముఖ్యంగా సామాన్యులు కొనే రూ.20 వేల లోపు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లపై దారుణంగా పడింది. ఈ సెగ్మెంట్ లోని ఫోన్ల ధరలు సగటున 8 శాతం నుంచి 12 శాతం వరకు పెరగడం గమనార్హం.
ఏఐ డిమాండ్ ఎఫెక్ట్
టెక్ ఆర్క్ వ్యవస్థాపకుడు ఫైసల్ కావూసా తెలిపిన వివరాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరిగిపోవడంతో పెద్ద పెద్ద టెక్ కంపెనీలన్నీ ఈ మెమొరీ చిప్స్ కోసం ఎగబడుతున్నాయి. దీనివల్ల మార్కెట్లో చిప్స్ కొరత ఏర్పడి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ బలహీనపడటం, మొబైల్ కంపెనీలు తమ లాభాల మార్జిన్‌ను పెంచుకోవడంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టడం కూడా ఫోన్ల రేట్లు పెరగడానికి కారణాలుగా మారాయి.
భారీగా పడిపోనున్న కొత్త ఫోన్ల సేల్స్
మొబైల్స్ రేట్లు ఇలాగే కొనసాగితే ఈ ఏడాది భారతదేశంలో కొత్త స్మార్ట్‌ఫోన్ల టోటల్ అమ్మకాలు గతంలో అంచనా వేసిన 136-138 మిలియన్ యూనిట్ల నుంచి ఏకంగా 115-120 మిలియన్ యూనిట్లకు పడిపోయే ప్రమాదం ఉంది. అయితే ఈ పరిస్థితి సెకండ్ హ్యాండ్, రిఫర్బిష్డ్ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌కు భారీ ప్లస్ కానుంది. సర్వేలో పాల్గొన్న వారిలో 48 శాతం మంది ధరలు తగ్గే వరకు వేచి చూస్తామని చెప్పగా, మరో 6 శాతం మంది పాత ఫోన్లు లేదా రిఫర్బిష్డ్ ఫోన్లు కొనడానికి రెడీ అయిపోయారు. దీనివల్ల సెకండ్ హ్యాండ్ ఫోన్ల మార్కెట్ ఈ ఏడాది 23-25 మిలియన్ యూనిట్ల నుండి ఏకంగా 30-32 మిలియన్ యూనిట్లకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
కస్టమర్లకు బెస్ట్ ఫోన్ కావాలి.. కానీ తక్కువ ధరలోనే!
ఈ ట్రెండ్ పై ట్రాకిన్ టెక్ ఫౌండర్ అరుణ్ ప్రభుదేశాయ్ స్పందిస్తూ.. భారతీయ కస్టమర్లు ఎప్పుడూ లేటెస్ట్ ఫీచర్లు ఉన్న బెస్ట్ ఫోన్లనే కోరుకుంటారు, కానీ వాటికోసం భారీగా ఖర్చు చేయడానికి ఇష్టపడరని చెప్పారు. మొబైల్ బ్రాండ్లు ఇప్పటికైనా కస్టమర్ల పల్స్ తెలుసుకుని ధరలను కంట్రోల్ చేయకపోతే.. జనాలు కొత్త ఫోన్లు కొనడం పూర్తిగా బంద్ చేసి, తక్కువ ధరలో దొరికే ప్రత్యామ్నాయాల వైపు వెళ్లిపోవడం ఖాయమని హెచ్చరించారు.