SpaceX IPO : ఎలన్ మస్క్ క్రేజ్.. ముఖేష్ అంబానీకి కలిసొచ్చే ఛాన్స్.. అసలు మ్యాటర్ ఏంటంటే?

అసలు మ్యాటర్ ఏంటంటే?

Update: 2026-06-11 12:38 GMT

SpaceX IPO : ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు గ్లోబల్ ఇన్వెస్టర్లు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఎలన్ మస్క్‌కు చెందిన ప్రముఖ ప్రైవేట్ టెక్ దిగ్గజం స్పేస్‌ఎక్స్ ఐపీఓ వైపు అంతర్జాతీయ ఇన్వెస్టర్లు ఎగబడుతుండటం ఇప్పుడు భారత కుబేరుడు ముఖేష్ అంబానీకి ఒక మంచి అవకాశంగా మారబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నడుస్తున్నా కూడా.. పెద్ద పెద్ద టెక్ కంపెనీలపై ఇన్వెస్టర్లకు నమ్మకం తగ్గలేదని స్పేస్‌ఎక్స్ నిరూపించింది. ఈ సానుకూల వాతావరణం, చాలా కాలంగా ఐపీఓ (IPO) రేసులో ఉన్న రిలయన్స్ జియో ప్లాట్‌ఫార్మ్స్‌కు భారీ వాల్యుయేషన్ తెచ్చిపెట్టే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

భారతదేశ టెలికాం రంగంలో రిలయన్స్ జియో ఒక తిరుగులేని శక్తుగా ఎదిగింది. ప్రస్తుతం కంపెనీకి దేశవ్యాప్తంగా 52 కోట్ల మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ప్రతి యూజర్ నుండి కంపెనీకి వచ్చే సగటు నెలవారీ ఆదాయం (ARPU) సుమారు రూ.214 గా ఉంది. జియో వార్షిక నిర్వహణ ఆదాయం దాదాపు 15 బిలియన్ డాలర్లు కాగా.. కంపెనీ ఎబిటా మార్జిన్ 50 శాతం కంటే ఎక్కువగా ఉంది. ఈ బలమైన ఆర్థిక పునాది వల్లే గ్లోబల్ మార్కెట్ విశ్లేషకులు జియో ప్లాట్‌ఫార్మ్స్ విలువను ఏకంగా 130 బిలియన్ డాలర్లు (దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు) గా లెక్కగడుతున్నారు.

విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల భయం

జియో బిజినెస్ మోడల్ ఎంత బలంగా ఉన్నప్పటికీ, ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు అంబానీకి కొంత సవాలుగా మారేలా ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారత స్టాక్ మార్కెట్ నుంచి సుమారు 37 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. గ్లోబల్ ఫండ్స్ తమ పెట్టుబడులను తగ్గించుకుంటున్న తరుణంలో.. జియో తన భారీ ఐపీఓను విజయవంతం చేయడం కోసం విదేశీయుల కంటే మన దేశీయ రిటైల్ ఇన్వెస్టర్లు, భారతీయ సంస్థాగత ఇన్వెస్టర్ల పైనే ఎక్కువగా ఆధారపడాల్సి రావచ్చు.

ఆర్బీఐ నిర్ణయాలు, ఏఐ టెక్నాలజీపై జియో బెట్టింగ్

భారత మార్కెట్లో లిక్విడిటీ పెంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల కొన్ని సానుకూల చర్యలు తీసుకుంది. విదేశాల్లో ఉండే భారతీయుల ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలోకి భారీగా నిధులు వస్తే మార్కెట్ మరింత పుంజుకునే అవకాశం ఉంది. దీనితో పాటు జియో భవిష్యత్ వృద్ధి కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజిటల్ సర్వీసులపై భారీగా ప్లాన్ చేస్తోంది. మెటా వంటి అంతర్జాతీయ సోషల్ మీడియా దిగ్గజంతో జతకట్టి.. భారతీయ మార్కెట్ కోసం చౌకైన ఏఐ సొల్యూషన్స్ తీసుకురావాలని చూస్తోంది. అయితే కొందరు నిపుణులు మాత్రం అమెరికా ఏఐ కంపెనీల రేంజ్ ఆవిష్కరణలు జియోలో ఇంకా కనిపించడం లేదని అభిప్రాయపడుతున్నారు.

ఇన్వెస్టర్లకు నిపుణుల హెచ్చరిక

మార్కెట్ చరిత్రను చూస్తే ప్రతి పెద్ద ఐపీఓ సక్సెస్ అవుతుందని చెప్పలేం. గతంలో 2008 లో వచ్చిన రిలయన్స్ పవర్ ఐపీఓ, అలాగే 2010 లో వచ్చిన కోల్ ఇండియా ఐపీఓలు మార్కెట్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే వచ్చాయి. ఆ భారీ ఐపీఓల తర్వాత మార్కెట్లో పెద్ద పతనం చూశాం. మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం.. జియో లాంటి భారీ ఐపీఓలు మార్కెట్ లోని సింహభాగం నగదును లాగేసుకుంటాయి, దీనివల్ల సెకండరీ మార్కెట్‌పై తీవ్ర ఒత్తిడి పడే ప్రమాదం ఉంది. అందుకే కేవలం కంపెనీ పాపులారిటీని చూసి కాకుండా, రిస్క్ ఫ్యాక్టర్లను కూడా గమనించి ఇన్వెస్టర్లు అడుగులు వేయాలని సూచిస్తున్నారు.

Tags:    

Similar News