SIP : రిటైర్మెంట్ టెన్షన్ వద్దు.. ఈ 10-15-20 ఫార్ములాతో మీరే సొంతంగా పెన్షన్ ప్లాన్ చేసుకోండి
ఈ 10-15-20 ఫార్ములాతో మీరే సొంతంగా పెన్షన్ ప్లాన్ చేసుకోండి
SIP : రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే చాలా మందికి అదొక కొరుకుడు పడని కొయ్యలా, లేదా వయసు అయిపోయాక ఆలోచించాల్సిన విషయంగా అనిపిస్తుంది. కానీ, తెలివిగా పెట్టుబడి పెడితే.. చిన్న చిన్న పొదుపులే భవిష్యత్తులో కొండంత అండగా నిలుస్తాయి. ముఖ్యంగా SIP, SWP కాంబినేషన్ ఉంటే, ప్రభుత్వ పెన్షన్ లేకపోయినా మీరే స్వయంగా నెలకు లక్షల్లో పెన్షన్ పొందేలా ప్లాన్ చేసుకోవచ్చు. రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలంటే ఈ 10-15-20 ఫార్ములా బాగా పని చేస్తుంది. దీని అర్థం క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం, ప్రతి ఏటా పెట్టుబడిని పెంచుకుంటూ పోవడం, చివరికి ఆ డబ్బుతోనే ప్రతి నెలా స్థిరమైన ఆదాయం పొందడం. ఈ ప్లాన్ ఎలా పని చేస్తుందో స్టెప్ బై స్టెప్ వివరంగా చూద్దాం.
మొదటి దశ: SIP ద్వారా భారీ నిధిని సృష్టించడం
మీకు 30 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నెలకు రూ.10,000 ఎస్ఐపీతో పెట్టుబడి మొదలుపెట్టారని అనుకుందాం. ప్రతి ఏటా మీ జీతం పెరిగిన కొద్దీ, మీ పెట్టుబడిని కూడా 10% పెంచుకుంటూ పోవాలి (దీనినే స్టెప్-అప్ ఎస్ఐపీ అంటారు). ఇలా 20 ఏళ్ల పాటు చేస్తూ, సగటున 15% వార్షిక రిటర్న్స్ వస్తే.. మీరు 50 ఏళ్ల వయసు వచ్చేసరికి మీ దగ్గర దాదాపు రూ.2.5 కోట్ల భారీ నిధి ఉంటుంది. ఇక్కడ చక్రవడ్డీ మ్యాజిక్ వల్ల మీరు పెట్టిన పెట్టుబడి కంటే వచ్చే లాభమే చాలా ఎక్కువగా ఉంటుంది.
రెండవ దశ: SWP ద్వారా నెలవారీ పెన్షన్
డబ్బు జమ చేయడం ఒక ఎత్తైతే, దానిని తెలివిగా వాడుకోవడం మరో ఎత్తు. మీ దగ్గర రూ.2.5 కోట్ల ఫండ్ సిద్ధంగా ఉన్నప్పుడు, దానిని SWP (Systematic Withdrawal Plan)లోకి మార్చాలి. అంటే ఆ నిధిని మ్యూచువల్ ఫండ్స్ లోనే ఉంచి, ప్రతి నెలా మీకు కావాల్సినంత మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవడం. ఉదాహరణకు, మీరు నెలకు రూ.2 లక్షల చొప్పున విత్ డ్రా చేసుకున్నారనుకుందాం. మిగిలిన మొత్తంపై 8% రిటర్న్స్ వస్తుంటే.. మీరు మరో 20 ఏళ్ల పాటు నెలకు రూ.2 లక్షల పెన్షన్ తీసుకోవచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, 20 ఏళ్ల తర్వాత కూడా మీ ఖాతాలో ఇంకా రూ.45 లక్షల వరకు మిగిలే అవకాశం ఉంటుంది.
స్టెప్-అప్ ఎస్ఐపీ వల్ల కలిగే ప్రయోజనాలు
సాధారణ ఎస్ఐపీ కంటే స్టెప్-అప్ ఎస్ఐపీ చాలా పవర్‌ఫుల్. ప్రతి ఏటా కేవలం 10 శాతం పెట్టుబడి పెంచడం వల్ల మీ చివరి నిధి ఊహించని రేంజ్ లో పెరుగుతుంది. దీనివల్ల రూపాయి కాస్ట్ యావరేజింగ్ ప్రయోజనం దక్కుతుంది. అంటే మార్కెట్ పడిపోయినప్పుడు ఎక్కువ యూనిట్లు, మార్కెట్ పెరిగినప్పుడు తక్కువ యూనిట్లు కొంటూ మీ పెట్టుబడి సగటు ఖర్చును తగ్గిస్తుంది. అన్నిటికంటే ముఖ్యం ఇది మీలో ఒక ఆర్థిక క్రమశిక్షణను పెంచుతుంది.
గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు
ఈ లెక్కలన్నీ 15%, 8% రిటర్న్స్ వస్తాయనే అంచనాతో వేసినవి. మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ మార్కెట్ హెచ్చుతగ్గులపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి రిటర్న్స్ లో కొంచెం తేడాలు ఉండవచ్చు. మీరు ఎంత త్వరగా పెట్టుబడి మొదలుపెడితే, అంత తక్కువ మొత్తంతో పెద్ద నిధిని సృష్టించవచ్చు. ఆలస్యం చేసే కొద్దీ రిటైర్మెంట్ టార్గెట్ ను అందుకోవడం కష్టమవుతుంది. కాబట్టి క్రమం తప్పకుండా, క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టి మీ రిటైర్మెంట్ లైఫ్‌ను సేఫ్ చేసుకోండి.