India EU Trade : ట్రంప్ టారిఫ్ దెబ్బ..భారత్‌కు అదిరిపోయే అదృష్టం

భారత్‌కు అదిరిపోయే అదృష్టం

Update: 2026-01-20 05:15 GMT

India EU Trade : అంతర్జాతీయ వాణిజ్య రంగంలో చదరంగం ఆట మొదలైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు ఇప్పుడు భారతదేశానికి వరంగా మారబోతున్నాయి. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ దేశాలపై ట్రంప్ ప్రకటించిన గ్రీన్‌ల్యాండ్ టారిఫ్ యుద్ధం, భారత్-యూరప్ మధ్య ఒక చారిత్రాత్మక డీల్ కు దారితీస్తోంది. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న చందంగా.. అమెరికా విధిస్తున్న ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి యూరప్ ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయాలనే ప్రతిపాదనను యూరోపియన్ దేశాలు తిరస్కరించడమే ఈ వివాదానికి మూలం. దీంతో ఆగ్రహం చెందిన ట్రంప్.. డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ వంటి దేశాల నుంచి వచ్చే దిగుమతులపై 10 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 1 నుంచి ఇది అమలులోకి రానుంది. జూన్ నాటికి ఈ పన్నును ఏకంగా 25 శాతానికి పెంచుతామని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా గ్రీన్‌ల్యాండ్‌ను దక్కించుకునే వరకు ఈ పన్నుల బాదుడు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయం యూరోపియన్ యూనియన్ దేశాల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుంది.

అమెరికాతో వాణిజ్య యుద్ధం మొదలవ్వడంతో.. యూరోపియన్ యూనియన్ ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్కెట్ల కోసం వెతుకుతోంది. ఈ క్రమంలో భారత్‌తో పెండింగ్‌లో ఉన్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ను వెంటనే పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. జనవరి 25 నుంచి 27 వరకు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ భారత్‌లో పర్యటించనున్నారు. వీరు మన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ఈ పర్యటనలోనే జనవరి 27న భారత్-EU మధ్య చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉంది.

ఈ ఒప్పందం కుదిరితే భారతీయ ఉత్పత్తులకు యూరప్‌లోని 27 దేశాల మార్కెట్లలో భారీగా ప్రవేశం లభిస్తుంది. ముఖ్యంగా రెడీమేడ్ దుస్తులు, టెక్స్‌టైల్స్, లెదర్ వస్తువులు, ఐటీ సర్వీసులు, వ్యవసాయ ఉత్పత్తులకు యూరప్‌లో డిమాండ్ పెరుగుతుంది. అమెరికా విధిస్తున్న పన్నుల వల్ల యూరప్ దేశాలు అమెరికా నుంచి దిగుమతులు తగ్గించుకుని, భారత్ నుంచి పెంచుకునే అవకాశం ఉంది. దీనివల్ల మన దేశానికి విదేశీ మారకద్రవ్యం పెరగడమే కాకుండా, లక్షలాది మందికి ఉపాధి లభిస్తుంది. అస్థిరమైన అంతర్జాతీయ మార్కెట్‌లో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోంది.

ఒకవైపు ట్రంప్ భారత్ నుంచి వచ్చే ఉత్పత్తులపై కూడా పన్నులు పెంచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే, యూరప్‌తో కుదుర్చుకుంటున్న ఈ మహా డీల్ వల్ల అమెరికా నుంచి కలిగే నష్టాన్ని భారత్ సులభంగా పూడ్చుకోగలదు. ఇప్పటికే మిడిల్ ఈస్ట్ దేశాలతో భారత్ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇప్పుడు యూరప్ కూడా తోడైతే, భారత ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టమవుతుంది. చైనా, అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం కూడా భారత్‌కు పరోక్షంగా లాభం చేకూరుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసులో భారత్ ఇప్పుడు కీలక పాత్ర పోషించబోతోంది.

Tags:    

Similar News