Gulf Oil War : ఇరాన్ దాడుల ఎఫెక్ట్.. తూర్పు తీరంలో కొత్త ఓడరేవులు, భారీ పైప్‌లైన్ల నిర్మాణానికి యూఏఈ శ్రీకారం
భారీ పైప్‌లైన్ల నిర్మాణానికి యూఏఈ శ్రీకారం
Gulf Oil War : అమెరికా, ఇరాన్ దేశాల మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ.. మిడిల్ ఈస్ట్‌లో ఇంధన సరఫరాపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యూహంపై వేగంగా అడుగులు వేస్తోంది. ఇరాన్ కంటిచూపుతో శాసించే హోర్ముజ్ జలమార్గం పై తన ఆధారపడటాన్ని పూర్తిగా జీరో చేయడానికి యూఏఈ సంచలన ప్లాన్ సిద్ధం చేసింది. ఈ రూట్ భవిష్యత్తులో తెరుచుకున్నా, లేకపోయినా తాము అనుకున్న ప్రాజెక్టులను ఆపబోమని యూఏఈ విదేశీ వాణిజ్య మంత్రి థాని అల్ జయూది స్పష్టం చేశారు.
దాడుల ఎఫెక్ట్.. పాఠాలు నేర్చుకున్న యూఏఈ
గత ఫిబ్రవరి చివరిలో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై భారీగా బాంబు దాడులు జరపడంతో హోర్ముజ్ జలమార్గం గుండా రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్, కెమికల్స్, అల్యూమినియం సరఫరాకు పెద్ద బ్రేక్ పడింది. అంతేకాకుండా ఇరాన్ ఏకంగా 3,000 డ్రోన్లు, బాలిస్టిక్ మిసైళ్లతో యూఏఈ పై విరుచుకుపడింది. ఈ దాడుల వల్ల యూఏఈ తూర్పు తీరంలోని ఫుజైరా ఎనర్జీ హబ్ పాక్షికంగా దెబ్బతింది. కష్టకాలంలోనే తమ లోపాలను గుర్తించిన యూఏఈ.. హోర్ముజ్ రూట్‌ను బైపాస్ చేసే శాశ్వత లైఫ్‌లైన్ నిర్మాణాన్ని వేగవంతం చేసింది.
బిలియన్ డాలర్లతో సరికొత్త పోర్టుల విస్తరణ
యూఏఈ సరికొత్త ప్లాన్ ప్రకారం ఒమన్ గల్ఫ్ తీరంలో హోర్ముజ్ జలమార్గానికి వెలుపల ఉన్న దిబ్బా, ఫుజైరా, ఖోర్ ఫక్కన్ వంటి కీలక ఓడరేవులను భారీ ఎత్తున విస్తరిస్తున్నారు. వీటితో పాటు అదే తీరప్రాంతంలో మరో సరికొత్త అంతర్జాతీయ పోర్టును కూడా నిర్మించనున్నారు. ఈ నూతన రేవులను దేశంలోని ప్రధాన చమురు, గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలతో కనెక్ట్ చేయడానికి వేల కోట్ల పెట్టుబడులతో కొత్త రైల్వే లైన్లు, అత్యాధునిక రోడ్డు నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల షిప్పులు ఇరాన్ సరిహద్దుల్లోకి వెళ్లకుండానే నేరుగా అంతర్జాతీయ సముద్రంలోకి ప్రవేశించవచ్చు.
ఎగుమతులు రెట్టింపు చేసేలా సరికొత్త పైప్‌లైన్లు
ప్రస్తుతం చమురు క్షేత్రాల నుంచి ఫుజైరా పోర్టుకు రోజుకు 1.5 మిలియన్ బారెళ్ల ఆయిల్ తరలించే పైప్‌లైన్ యూఏఈ కి పెద్ద దిక్కుగా మారింది. అయితే భవిష్యత్తు అవసరాల కోసం ఫుజైరా ద్వారా ముడి చమురు ఎగుమతులను రెట్టింపు చేసేందుకు రెండో పైప్‌లైన్ పనులను యూఏఈ వేగవంతం చేసింది. దీనితో పాటు మూడో పెట్రోలియం పైప్‌లైన్, ఎల్‌ఎన్‌జీ, పెట్రోకెమికల్స్ ఎగుమతి కోసం మరికొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తోంది. ఇందుకు కొన్ని బిలియన్ డాలర్ల బడ్జెట్ ఖర్చవుతుందని అంచనా.
యూఏఈ ముందున్న సవాళ్లు ఇవే
అయితే హోర్ముజ్ రూట్‌ను పూర్తిగా వదిలేయడం యూఏఈ కి అంత సులువైన విషయం కాదు. పైప్‌లైన్ల ద్వారా ముడి చమురును తూర్పు తీరానికి తరలించగలిగినా.. ఎల్‌ఎన్‌జీ గ్యాస్, అల్యూమినియం వంటి భారీ ఉత్పత్తులను రోడ్డు మార్గంలో తరలించడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అంతేకాకుండా ఆసియాలోనే అతిపెద్ద కంటైనర్ హబ్ అయిన జెబెల్ అలీ పోర్టుకు వచ్చే దిగుమతులపై యూఏఈ ఎక్కువగా ఆధారపడుతుంది. తూర్పు పోర్టుల నుంచి దుబాయ్, అబుదాబి నగరాలకు ట్రక్కుల ద్వారా సరుకులు రవాణా చేస్తే ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి.
రైల్వే విప్లవంతో రవాణా ఖర్చులకు చెక్
పెరుగుతున్న రవాణా ఖర్చులను తగ్గించడానికి యూఏఈ తన దేశీయ రైల్వే నెట్‌వర్క్‌ను భారీగా విస్తరిస్తోంది. రైళ్ల ద్వారా కంటైనర్లను తక్కువ ఖర్చుతో సిటీలకు చేర్చవచ్చని భావిస్తోంది. మరోవైపు, అరేబియా గల్ఫ్ ప్రాంతంలో తన ఎల్‌ఎన్‌జీ ఎగుమతి సామర్థ్యాన్ని రెట్టింపు చేసేలా కొత్త ప్రాజెక్టును కూడా కడుతోంది. యుద్ధం ముగిసినా కూడా తమ సముద్ర పరిధి దాటి వెళ్లే నౌకలపై ఇరాన్ పన్నులు వసూలు చేయాలని చూస్తుండటాన్ని అమెరికా, యూరప్‌లతో కలిసి యూఏఈ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇరాన్ బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు లొంగకుండా తన సొంత ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడమే లక్ష్యంగా యూఏఈ ముందుకు సాగుతోంది.