Trump Tariff : ట్రంప్ పన్ను బాదుడుకు సుప్రీంకోర్టు బ్రేక్.. వ్యాపారులకు రూ.1.8 లక్షల కోట్ల భారీ రిఫండ్

వ్యాపారులకు రూ.1.8 లక్షల కోట్ల భారీ రిఫండ్

Update: 2026-06-11 12:35 GMT

Trump Tariff : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక వివాదాస్పద నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయ వ్యాపార వర్గాలకు భారీ లాభాన్ని తెచ్చిపెట్టింది. గ్లోబల్ ట్రేడ్ పార్ట్‌నర్లపై ట్రంప్ విధించిన భారీ టారిఫ్ పన్నులను అమెరికా సుప్రీంకోర్టు అక్రమమైనవని తేల్చడంతో.. అక్కడి ట్రెజరీ డిపార్ట్‌మెంట్ (ఆర్థిక శాఖ) మే నెలలో ఏకంగా 22 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.8 లక్షల కోట్లు) కస్టమ్స్ పన్నులను వ్యాపారులకు తిరిగి చెల్లించింది. కోర్టు ఇచ్చిన గట్టి తీర్పు తర్వాత ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు వెనక్కి రావడం ఇదే మొదటిసారి కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంపోర్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ట్రంప్ ప్లాన్లకు సుప్రీంకోర్టు కోలుకోలేని షాక్

ఈ వివాదానికి సంబంధించిన అసలు కథ గత ఫిబ్రవరి నెలలో మొదలైంది. డొనాల్డ్ ట్రంప్ తన అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం(IEEPA) పరిధిని దాటి విదేశీ వస్తువులపై భారీగా పన్నులు వసూలు చేశారని అమెరికా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అధ్యక్షుడికి ఉన్న అత్యవసర అధికారాలను ఇలా ఇష్టమొచ్చినట్లు వాడటం చట్టవిరుద్ధమని కోర్టు తీర్పునిచ్చింది. ఈ సంచలన తీర్పు వచ్చిన వెంటనే యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం అలర్ట్ అయింది. ట్రంప్ హయాంలో అక్రమంగా వసూలు చేసిన మొత్తం 166 బిలియన్ డాలర్లను తిరిగి ఇచ్చేందుకు ఒక స్పెషల్ రిఫండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే మే నెలలో మొదటి విడతగా 22 బిలియన్ డాలర్లను రీఫండ్ చేశారు.

డబ్బులు వస్తున్నా వీడని లీగల్ టెన్షన్లు

వ్యాపారులకు డబ్బులు వెనక్కి రావడం మొదలైనప్పటికీ.. ఈ ప్రక్రియ అంత ఈజీగా సాగేలా కనిపించడం లేదు. ఎందుకంటే ట్రేడ్ కోర్టు ఇచ్చిన ఈ రిఫండ్ ఆర్డర్‌పై ట్రంప్ బృందం మళ్లీ అప్పీలుకు వెళ్లింది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న చెల్లింపుల ప్రక్రియ ఎక్కడ ఆగిపోతుందో అని వ్యాపారులు టెన్షన్ పడుతున్నారు. ఈ కేసును విచారిస్తున్న యూఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ జడ్జి రిచర్డ్ ఈటన్ ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయపరమైన ప్రక్రియలో ఎవరు జోక్యం చేసుకున్నా సహించేది లేదని, దానివల్ల రిఫండ్ పనులు ఆలస్యమైతే ఊరుకోబోమని గత వారమే ఒక లేఖ ద్వారా కఠిన హెచ్చరికలు జారీ చేశారు.

తగ్గేదేలే అంటున్న అమెరికా యంత్రాంగం

సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ట్రంప్ తెచ్చిన పాత గ్లోబల్ టారిఫ్‌లు రద్దయినప్పటికీ.. అమెరికా అధికార యంత్రాంగం మాత్రం వ్యాపారులను వదిలేలా లేదు. ఇతర లీగల్ అధికారాలను వాడుకుంటూ విదేశాల నుంచి వచ్చే దిగుమతులపై కొత్తగా 10 శాతం డ్యూటీని విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతానికి ఇది తాత్కాలిక నిర్ణయమేనని చెప్తున్నప్పటికీ.. భవిష్యత్తులో దీని స్థానంలో పర్మనెంట్ ట్యాక్స్ తీసుకురావడానికి అమెరికా అధికారులు వేగంగా పావులు కదుపుతున్నారు.

పాత టారిఫ్‌లు యథాతథం

ఇక్కడ వ్యాపార సంస్థలు గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తాజా ఉపశమన తీర్పు అన్ని రకాల వస్తువులకు వర్తించదు. ట్రంప్ హయాంలో దేశ రక్షణ, ఇతర కారణాల రీత్యా స్టీల్ (ఉక్కు), అల్యూమినియం, ఆటోమొబైల్స్ వంటి కీలక రంగాలపై విధించిన పాత టారిఫ్ పన్నులపై ఈ తీర్పు ఎలాంటి ప్రభావం చూపదు. ఆయా రంగాలకు సంబంధించిన పన్నులు ఎప్పటిలాగే కొనసాగుతాయని, కేవలం అత్యవసర అధికారాల కింద వసూలు చేసిన జనరల్ ట్యాక్సులు మాత్రమే రిఫండ్ అవుతాయని అధికారులు క్లారిటీ ఇచ్చారు.

Tags:    

Similar News