Vande Bharat : వందే భారత్ రైలుపై కుట్ర జరుగుతోందా? సోషల్ మీడియా పోస్టులపై రైల్వే శాఖ సీరియస్

సోషల్ మీడియా పోస్టులపై రైల్వే శాఖ సీరియస్

Update: 2026-06-06 07:02 GMT

Vande Bharat : భారతీయ రైల్వే గర్వకారణంగా భావించే అత్యాధునిక వందే భారత్ రైళ్ల ఇమేజ్‌ను పాడుచేసేందుకు సోషల్ మీడియాలో ఒక వ్యవస్థీకృత కుట్ర జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. గత కొన్ని రోజులుగా ఈ ప్రతిష్టాత్మక రైళ్లకు సంబంధించి హఠాత్తుగా అనేక ప్రతికూల వార్తలు, పోస్టులు ఇంటర్నెట్‌లో దర్శనమిచ్చాయి. అయితే దీనిపై రైల్వే శాఖ అంతర్గతంగా లోతైన పరిశోధన చేయగా, ఇవన్నీ కేవలం భ్రమలు కల్పించడానికి, ప్రయాణికుల్లో అపనమ్మకాన్ని పెంచడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన ఫేక్ పోస్టులని తేలింది.

విచారణలో బయటపడ్డ షాకింగ్ నిజాలు

సోషల్ మీడియాలో వస్తున్న ఫిర్యాదులపై రైల్వే అధికారులు ప్రత్యేకంగా నిఘా పెట్టారు. అసలు ఈ ఫిర్యాదులు చేసిన వారు నిజంగానే వందే భారత్ రైళ్లలో ప్రయాణించారా లేదా అని చెక్ చేయగా అసలు నిజాలు బయటపడ్డాయి. వేర్వేరు పేర్లతో, వేర్వేరు స్టేషన్ల నుంచి ఈ పోస్టులు పెట్టినప్పటికీ.. అందరూ ఉపయోగించిన భాష, రాసిన కంటెంట్, పెట్టిన ఫొటోలు ఒకేలా ఉండటం అధికారులను ఆశ్చర్యపరిచింది. కేవలం రైలు రూట్లు, స్టేషన్ల పేర్లు మార్చి ఒకే రకమైన నెగెటివ్ కంటెంట్‌ను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నట్లు విచారణలో స్పష్టమైంది.

గట్టి యాక్షన్ తీసుకున్న రైల్వే శాఖ

వందే భారత్ రైళ్లలో లభించే భోజనం నాణ్యత లేదని, ప్రయాణ అనుభవం దారుణంగా ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న హ్యాండిల్స్‌పై రైల్వే శాఖ చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగానే పబ్లిక్ ప్రాపర్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారనే ఆరోపణలపై గుర్తుతెలియని వ్యక్తులపై పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు సంస్థలు సీరియస్‌గా తీసుకున్నాయని, త్వరలోనే ఈ ఫేక్ పోస్టుల వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకుంటామని రైల్వే వర్గాలు తెలిపాయి.

ప్రయాణికుల్లో భయం సృష్టించడమే లక్ష్యం

ఈ వ్యవహారంపై రైల్వే ఉన్నతాధికారులు స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంస్థల ప్రతిష్టను దిగజార్చడమే కాకుండా, రైళ్లలో ప్రయాణించే అమాయక ప్రయాణికులలో అనవసరమైన భయాన్ని, అయోమయాన్ని సృష్టించడమే ఈ నకిలీ ప్రచారాల వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశమని వారు పేర్కొన్నారు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్‌లో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ, ఆధారాలు లేని తప్పుడు వార్తలను ఫార్వార్డ్ చేసే లేదా పోస్ట్ చేసే వారిపై భవిష్యత్తులో కూడా కఠినమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఆ కంటెంట్ అంతా ముందస్తు ప్లాన్ ప్రకారమే

రైల్వే వర్గాల సమాచారం ప్రకారం.. ఈ నెగెటివ్ క్యాంపెయిన్ అంతా ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేసి నడుపుతున్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు దేశవ్యాప్తంగా వస్తున్న ఆదరణను తట్టుకోలేక, కొందరు కావాలనే ఇదంతా చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రయాణికులు ఇలాంటి సోషల్ మీడియా పుకార్లను నమ్మవద్దని, ఏదైనా సమస్య ఉంటే అధికారిక రైల్వే హెల్ప్‌లైన్ నంబర్లకు లేదా అధికారిక యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని అధికారులు కోరారు.

Tags:    

Similar News