Women Perform Shraddha and Pind Daan: పితృపక్షం వేళ పితృదేవతల ఆత్మశాంతి కోసం శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానం చేయడం హిందూ సంప్రదాయంలో అనాదిగా వస్తున్న ఆచారం. అయితే సాధారణంగా ఈ కర్మలను పురుషులే చేయాలనే అభిప్రాయం సమాజంలో బలంగా ఉంది. కొడుకులు లేని కుటుంబాల్లో లేదా పురుషులు అందుబాటులో లేని పరిస్థితుల్లో స్త్రీలు శ్రాద్ధం లేదా పిండ ప్రదానం చేయవచ్చా అనే సందేహం చాలామందిలో తలెత్తుతుంటుంది. ఈ ప్రశ్నకు హిందూ ధర్మశాస్త్రాలు, పురాణ గ్రంథాలు స్పష్టమైన సమాధానాన్ని ఇస్తున్నాయి.

ధర్మశాస్త్రాల ప్రకారం, ఒక కుటుంబంలో మగ సంతానం లేనప్పుడు కుమార్తె లేదా భార్య పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానం చేసే పూర్తి అధికారం ఉంది. గరుడ పురాణం, మనుస్మృతి వంటి గ్రంథాలు సైతం ఆపద్ధర్మ పరిస్థితుల్లో స్త్రీలు పితృ కార్యాలు చేయవచ్చని పేర్కొంటున్నాయి. పురుషులు లేనంత మాత్రాన పితృదేవతలు ఆకలితో, ముక్తి లేకుండా మిగిలిపోకూడదనే ఉద్దేశంతో శాస్త్రాలు మహిళలకు ఈ వెసులుబాటును కల్పించాయి. శ్రద్ధ, భక్తితో సమర్పించే పిండాన్ని పితృదేవతలు తప్పక స్వీకరిస్తారని పురాణాలు చెబుతున్నాయి.

ఈ విషయానికి బలమైన నిదర్శనంగా రామాయణంలోని సీతాదేవి ఉదంతాన్ని పండితులు ప్రధానంగా ప్రస్తావిస్తారు. వనవాస సమయంలో దశరథ మహారాజు మరణించినప్పుడు, గయా క్షేత్రంలో ఫల్గు నది ఒడ్డున సీతాదేవి స్వయంగా ఇసుకతో పిండాలను తయారు చేసి తన మామగారైన దశరథుడికి పిండ ప్రదానం చేసింది. రాముడు, లక్ష్మణుడు పూజా సామగ్రి తీసుకురావడానికి వెళ్లిన సమయంలో ముహూర్తం దాటిపోతుండటంతో, సాక్షాత్తు దశరథుడి ఆత్మ ప్రత్యక్షమై పిండం కోరగా సీతాదేవి ఆ కర్మను పూర్తి చేసింది. దశరథుడి చేతులు ప్రత్యక్షమై సీతమ్మ ఇచ్చిన పిండాన్ని ఆనందంగా స్వీకరించాయని పురాణ గాథ చెబుతోంది.

శాస్త్ర నిబంధనల ప్రకారం మహిళలు పిండ ప్రదానం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. పురుషుల మాదిరిగా వేద మంత్రాలను ఉచ్చరించకుండా, కేవలం నామోచ్ఛారణతో, భక్తి ప్రపత్తులతో సంకల్పం చెప్పుకుని పిండ ప్రదానం లేదా తర్పణం విడవాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి. కాలక్రమేణా ఏర్పడిన కొన్ని అపోహల వల్ల మహిళలు ఈ కర్మలకు దూరం కావడం జరిగిందే తప్ప, మూల శాస్త్రాలు ఎన్నడూ వారిని నిషేధించలేదని, తల్లిదండ్రుల పట్ల భక్తి భావంతో కుమార్తెలు చేసే శ్రాద్ధం కూడా సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుందని ఆధ్యాత్మిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Tags: