Tirumala Development: తిరుమల, తిరుపతి అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటనలు చేశారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో పలు అభివృద్ధి ప్రణాళికలను వెల్లడించారు. తిరుపతి రైల్వే స్టేషన్‌ నుంచి బస్టాండ్‌ వరకు అనుసంధానం చేసేలా స్కైవాక్‌ ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందని సీఎం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలోనే ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇటీవల తిరుపతిలో సేకరించిన 50 ఎకరాల స్థలంలో మల్టీస్టోరీడ్ పార్కింగ్‌ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.

తిరుపతిని వివిధ హైవేలకు అనుసంధానం చేసేలా కార్యాచరణ రూపొందించడంతో పాటు, నగరాన్ని ఆధ్యాత్మిక, ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. శ్రీవారి దర్శనం కోసం దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులతో తిరుపతి భవిష్యత్తులో సర్వీస్‌ హబ్‌గా మారుతుందని పేర్కొన్నారు. తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో నెట్‌జీరో కాన్సెప్ట్‌ అమలు చేయాలని సీఎం సూచించారు. సౌర, పవన విద్యుత్‌తో పాటు బ్యాటరీ స్టోరేజీ ద్వారా విద్యుత్‌ ఉత్పత్తిపై దృష్టి పెట్టాలని చెప్పారు. ప్రతి టీటీడీ భవనంపై సౌరవిద్యుత్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలిపారు. ప్రస్తుతం టీటీడీ సుమారు కోటి యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుండగా, దాదాపు 10 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. వ్యర్థాలను సర్క్యులర్‌ ఎకానమీలోకి తీసుకెళ్లేలా చర్యలు చేపట్టాలని, తిరుమలలో జీరో వేస్ట్‌ విధానాన్ని అమలు చేసి పర్యావరణ పరిరక్షణకు మోడల్‌గా తీర్చిదిద్దాలని అన్నారు.

తిరుపతిని ఆధ్యాత్మిక హబ్‌తో పాటు వెడ్డింగ్ డెస్టినేషన్‌గా కూడా అభివృద్ధి చేయాలన్నది తమ ఆలోచన అని సీఎం చెప్పారు. తిరుమలలో జరిగే కల్యాణాలకు ప్రత్యేక విశిష్టత ఉందని, ఆధ్యాత్మికంగా ప్రజలను కలిపేందుకు బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాలు కీలకమని అన్నారు. తిరుమలతో పాటు తిరుపతిలోనూ శ్రీవారి బ్రహ్మోత్సవాల వైభవం కనిపించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. టీటీడీ ఎస్వీ అన్నదానం ట్రస్ట్‌కు దాదాపు రూ.3,165 కోట్ల కార్పస్‌ ఫండ్‌ ఉందని చంద్రబాబు తెలిపారు. భవిష్యత్తులో భక్తులకు అన్నప్రసాదాలను మరింత మెరుగ్గా అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అదేవిధంగా ప్రాణదానం ట్రస్ట్‌ ద్వారా రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. స్విమ్స్‌, బర్డ్‌, రుయా, సెంట్రల్‌ హాస్పిటల్‌, కార్డియాలజీ ఆసుపత్రులను అనుసంధానం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు వెల్లడించారు. తిరుపతిలోని అరవింద్‌ ఐ హాస్పిటల్‌, క్యాన్సర్‌ ఆసుపత్రులను కూడా నాన్‌ ప్రాఫిట్‌ సంస్థల సమన్వయంతో అనుసంధానం చేసేలా చర్యలు చేపట్టాలని సూచించినట్లు తెలిపారు.

తిరుపతిని ఆధ్యాత్మిక హబ్‌గా మార్చే ప్రణాళికల్లో భాగంగా దాదాపు 5 వేల ఆలయాల నిర్మాణం, అవసరమైన చోట ఇప్పటికే ఉన్న ఆలయాల పునర్నిర్మాణానికి కార్యాచరణ రూపొందించాలని ఆదేశించినట్లు సీఎం చెప్పారు. టీటీడీ ఆధ్వర్యంలోని 65 ఆలయాలను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని సూచించారు. శ్రీవారి ఆస్తులు, ఆభరణాలు, బంగారం, నిధులు, భూములకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. మారిషస్‌, న్యూజిలాండ్‌ వంటి దేశాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించాలని భక్తుల నుంచి అభ్యర్థనలు వస్తున్నాయని, దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ శ్రీవారి ఆలయాల నిర్మాణంపై ఆలోచన చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు.

తిరుమలలో నీటి సమస్యను ప్రస్తావించిన సీఎం.. భవిష్యత్తులో నీటి కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గతంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో తిరుమల ఆలయాన్ని మూసివేయాల్సిన పరిస్థితి వస్తుందేమోనన్న ప్రతిపాదన కూడా వచ్చినట్లు గుర్తుచేశారు. అలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా కల్యాణి డ్యామ్‌ నుంచి పైప్‌లైన్‌ ద్వారా కేవలం 100 రోజుల్లో తిరుమలకు నీటిని తరలించినట్లు చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాదికి సోమశిలకు, ఆ తర్వాత కండలేరు బాలాజీ సాగర్‌కు నీటిని తీసుకురావడంతో పాటు, వచ్చే ఏడాదిలోనే కల్యాణి డ్యామ్‌ నీటిని కూడా మరింతగా వినియోగించేలా చర్యలు చేపడతామని చెప్పారు. తిరుమల పవిత్రతను కాపాడుతూ.. ఆధునిక సౌకర్యాలు, పర్యావరణ పరిరక్షణ, భక్తుల సేవలను సమన్వయం చేసి తిరుమల-తిరుపతిని మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Tags: