Srivari Sarva Bhoopala Vahana Seva: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శుక్రవారం రాత్రి సర్వభూపాల వాహన సేవలో దేశంలోని వివిధ ప్రాంతాల సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా 9 రాష్ట్రాల నుంచి 20 కళాబృందాలకు చెందిన 527 మంది కళాకారులు పాల్గొన్నారు. గాన, వాద్య, నృత్య ప్రదర్శనలతో శ్రీవారిని కీర్తిస్తూ వాహన సేవకు మరింత శోభను చేకూర్చారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, కేరళ, పంజాబ్, ఒడిశా, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన కళాబృందాలు తమ సంప్రదాయ కళారూపాలను ప్రదర్శించాయి.

శాస్త్రీయ నృత్యాలతో అలరించిన కళాకారులు

సర్వభూపాల వాహన సేవలో భరతనాట్యం, కూచిపూడి, మోహినీయట్టం, ఒడిస్సీ, కథక్, పేరిణి శివతాండవం, మణిపురి తదితర శాస్త్రీయ నృత్యరూపాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కళాకారులు తమ అద్భుతమైన నృత్యాభినయంతో భారతీయ శాస్త్రీయ కళా వైభవాన్ని ఆవిష్కరించారు.

జానపద, గిరిజన కళారూపాలతో సందడి

భాంగ్రా, కోలాటం, లెజిమ్, నౌర్టా, బస్తర్ గిరిజన నృత్యం వంటి జానపద, గిరిజన కళారూపాలతో పాటు నవదుర్గ నృత్యం, దశావతార రూపకం, శ్రీకృష్ణ లీలలు తదితర ప్రదర్శనలు భక్తులను విశేషంగా అలరించాయి.

మహారాష్ట్రకు చెందిన డ్రమ్స్, లెజిమ్ విన్యాసాలు, కేరళ డ్రమ్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ వాయిద్యాల లయబద్ధమైన విన్యాసాలతో తిరుమాడ వీధులు మార్మోగాయి.

వివిధ సంస్కృతుల సంగమంగా సర్వభూపాల వాహన సేవ

వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన కళాకారులు తమ ప్రాంతీయ సంప్రదాయాలు, జానపద కళలు, శాస్త్రీయ నృత్యాలను శ్రీవారి వాహన సేవలో ప్రదర్శించడంతో తిరుమలలో భారతీయ కళా, సాంస్కృతిక వైవిధ్యం ఆవిష్కృతమైంది.

గాన, వాద్య, నృత్య కళారూపాల సమ్మేళనంతో సర్వభూపాల వాహన సేవ కనులపండువగా సాగింది. స్వామివారి దివ్యదర్శనంతో పాటు వివిధ రాష్ట్రాల కళా వైభవాన్ని వీక్షించిన భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని, సాంస్కృతిక అనుభూతిని ఏకకాలంలో పొందారు.

Tags: