Lord's Salakatla Brahmotsavams: భక్తులను అలరించిన దేశీయ కళారూపాలు
కళారూపాలు
Lord's Salakatla Brahmotsavams: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన గురువారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు ముత్యపుపందిరి వాహనంపై తిరుమాడ వీధుల్లో వైభవంగా విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా వాహనసేవకు ముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తొమ్మిది రాష్ట్రాలకు చెందిన 21 కళాబృందాల్లోని 547 మంది కళాకారులు తమ రాష్ట్రాల సంప్రదాయ కళారూపాలు, నృత్య విన్యాసాలను ప్రదర్శిస్తూ తిరుమలలో సాంస్కృతిక వైభవాన్ని చాటారు.
గుజరాత్ గర్బా.. రాధాకృష్ణుల రాసలీలను తలపించిన డాండియా
గుజరాత్‌కు చెందిన ప్రసిద్ధ గర్బా నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కళాకారులు వృత్తాకారంలో లయబద్ధంగా అడుగులు వేస్తూ, చప్పట్లు కొడుతూ ఉత్సాహభరితంగా గర్బా నృత్యాన్ని ప్రదర్శించారు. డాండియా నృత్య విన్యాసాలు రాధాకృష్ణుల రాసలీలను తలపిస్తూ భక్తులను అలరించాయి. గర్భదీపం చుట్టూ ప్రదర్శించే గర్బా నృత్యం సృష్టితత్వానికి ప్రతీకగా నిలిచింది.
హాలక్కి సుగ్గి కుణిత.. పంట పండుగ ఆనందాన్ని చాటిన నృత్యం
కర్ణాటకకు చెందిన హాలక్కి సుగ్గి కుణిత కళారూపం కూడా విశేషంగా ఆకట్టుకుంది. హాలక్కి వొక్కలిగ గిరిజన సమాజానికి చెందిన ఈ సంప్రదాయ నృత్యాన్ని పంటకోత పూర్తయిన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రదర్శించడం విశేషం.
వైవిధ్యభరిత కళారూపాలతో సాంస్కృతిక శోభ
వీరితోపాటు తాళం నృత్యం, డ్రమ్ము విన్యాసాలు, ఒడిశా శ్రీ నృత్యం, కంజారా కోలాటం, బంజారా నృత్యం, తెలంగాణ బ్రతుకమ్మ నృత్యం తదితర సంప్రదాయ కళారూపాలు సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి.
భక్తి.. సంస్కృతి.. కళల సంగమంగా తిరుమల
వివిధ రాష్ట్రాల సంప్రదాయ కళలు ఒకే వేదికపై ప్రదర్శితమవడంతో తిరుమలలో భక్తి, సంస్కృతి, కళల వైభవం వెల్లివిరిసింది. దేశీయ కళారూపాల ప్రదర్శనలతో భక్తులకు ఆధ్యాత్మిక ఆనందంతోపాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల వైవిధ్యాన్ని ఆస్వాదించే అవకాశం లభించింది.
శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆధ్యాత్మిక వైభవానికి దేశీయ కళారూపాల ప్రదర్శనలు మరింత వన్నె తెచ్చాయి.