Spiritual Secret: పూర్వజన్మ పాపాలు - ప్రస్తుత జన్మ బాధలు: అసలు రహస్యం ఏమిటి?
అసలు రహస్యం ఏమిటి?
Spiritual Secret: ప్రతి మనిషి జీవితంలో ఎన్నో రకాల సమస్యలు, సుఖదుఃఖాలు ఎదురవుతుంటాయి. అసలు ఈ బాధలు ఎందుకు వస్తాయి? గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో మనుషులను వేధిస్తాయా? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి?
హిందూ సనాతన ధర్మం చెప్పే కర్మ సిద్ధాంతం ప్రకారం.. మనిషి జన్మించడానికి కారణం ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలే. చెడు కర్మకి ఫలితం పాపం, పాపానికి దుఃఖం అయితే.. మంచి కర్మకి ఫలితం పుణ్యం, సుఖం అని శాస్త్రాలు చెబుతున్నాయి. పూర్వజన్మలో చేసిన పాపాలు కొన్నిసార్లు ప్రస్తుత జన్మలో ప్రాణాంతక వ్యాధుల రూపంలోనో, తీరని కష్టాల రూపంలోనో అనుభవించాల్సి వస్తుందని పండితులు పేర్కొంటున్నారు.
మహాభారతంలో అంపశయ్య మీద ఉన్న భీష్ముడు సైతం గత జన్మ పాపాలు, వాటి ప్రభావాల గురించి ధర్మరాజుకు అనేక ఉదాహరణలతో వివరించాడు. గత జన్మలో తల్లిదండ్రులను పట్టించుకోనివారు, తోటివారి జీవితాలతో ఆడుకున్నవారు.. ప్రస్తుత జన్మలో అచ్చం అలాంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్న ఉదాహరణలు మన చుట్టూ చాలానే కనిపిస్తుంటాయి.
అయితే, గత జన్మలో చేసిన పాపాలకు ఈ జన్మలో పూజలు, వ్రతాలు చేస్తే ఆ దోషాలు తొలగిపోతాయా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. వ్యాధి వస్తే మందు బిళ్ళ ఏ విధంగా అయితే క్రమంగా పనిచేసి రోగాన్ని నయం చేస్తుందో.. భగవంతుడికి చేసే త్రికరణశుద్ధి పూజలు, వ్రతాలు, శాంతులు కూడా గత జన్మ పాప ప్రభావాన్ని క్రమంగా తగ్గించి పటాపంచలు చేస్తాయని ఆధ్యాత్మిక వేత్తలు స్పష్టం చేస్తున్నారు.