Salakatla Brahmotsavams: సాలకట్ల బ్రహ్మోత్సవాలు... చక్రస్నానానికి పటిష్ట ఏర్పాట్లు
పటిష్ట ఏర్పాట్లు
Salakatla Brahmotsavams: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన సెప్టెంబరు 23న వైభవంగా నిర్వహించనున్న చక్రస్నానం సందర్భంగా శ్రీవారి పుష్కరిణిలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్. వెంకయ్య చౌదరి మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. పుష్కరిణి పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులు పుష్కరిణిలోకి సులభంగా ప్రవేశించి, తిరిగి బయటకు వెళ్లేలా నిర్దేశిత ప్రాంతాల్లో గేట్లు ఏర్పాటు చేసినట్లు అదనపు ఈవో తెలిపారు. టీటీడీ అధికారులు, విజిలెన్స్, పోలీసు సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. సెప్టెంబరు 23న ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులకు, చక్రత్తాళ్వార్‌కు స్నపనతిరుమంజనం, చక్రస్నానం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పవిత్ర ఘట్టాన్ని భక్తులు క్రమపద్ధతిలో వీక్షించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. చక్రస్నానం రోజంతా పవిత్ర ఘడియలుగా భావించబడుతుందని, భక్తులు తమకు అనుకూలమైన సమయంలో పుష్కరిణిలో పవిత్ర స్నానం ఆచరించవచ్చని అదనపు ఈవో తెలిపారు. భక్తులు నిర్దేశించిన గేట్ల ద్వారానే ప్రవేశించి, సంయమనం పాటిస్తూ టీటీడీ సిబ్బందికి సహకరించాలని కోరారు. పుష్కరిణి చుట్టూ ఏర్పాటు చేసిన గ్యాలరీల్లోని భక్తులను దశలవారీగా పుష్కరిణిలోకి అనుమతించాలని అధికారులను ఆదేశించారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. పోలీసులు, టీటీడీ విజిలెన్స్ విభాగంతోపాటు ఎన్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక, ఈతగాళ్ల బృందాలను అందుబాటులో ఉంచి పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పుష్కరిణిలో ఈతగాళ్లు, బోటును సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. భక్తులు చక్రస్నాన మహోత్సవాన్ని సులభంగా వీక్షించేందుకు ఆలయ పరిసరాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని అదనపు ఈవో సూచించారు. అంతకుముందు వైభవోత్సవ మండపంలో చక్రస్నానం ఏర్పాట్లపై టీటీడీలోని వివిధ విభాగాల అధికారులతో అదనపు ఈవో సమీక్ష నిర్వహించారు. భక్తుల సౌకర్యం, భద్రతకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.