Ashwa Vahana: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం రాత్రి అశ్వ వాహనంపై కల్కి అలంకారంలో శ్రీమలయప్ప స్వామివారు భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.

అశ్వ వాహనానికి ముందు గజరాజులు నడుస్తుండగా, భక్త బృందాల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ అత్యంత వైభవంగా జరిగింది. విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ గోవిందనామస్మరణతో స్వామివారిని దర్శించుకున్నారు.

ఇంద్రియ నియంత్రణకు అశ్వ వాహనం సందేశం

ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలతో పోలుస్తాయి. అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడిగా ఈ వాహనసేవ ద్వారా తెలియజేస్తున్నారు. కృష్ణయజుర్వేదం పరమాత్మను అశ్వ స్వరూపంగా తెలియజేస్తుంది.

కల్కి స్వరూపంలో అశ్వ వాహనంపై విహరించిన శ్రీమలయప్ప స్వామివారు కలియుగ దోషాలకు దూరంగా ఉండి, నామసంకీర్తనను ఆశ్రయించి భగవంతుని అనుగ్రహం పొందాలని భక్తులకు ప్రబోధిస్తున్నట్లు ఈ వాహనసేవ అంతరార్థాన్ని తెలియజేస్తోంది.

ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags: