Ap Education : ప్రాథమిక స్థాయిలోనే గ్యారంటీడ్‌ ఎఫ్ఎల్ఎన్ చేపట్టాలి

పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై సమీక్షలో మంత్రి నారా లోకేష్;

Update: 2025-07-16 03:30 GMT
  • పారదర్శకంగా ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక
  • ప్రతి హైస్కూల్ కు ఇంటర్నెట్, కంప్యూటర్ ల్యాబ్ సదుపాయం కల్పించాలి

ఉపాధ్యాయుల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థి అభ్యసన సామర్థ్యాల పెంపునకు గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్(ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) కార్యక్రమం చేపట్టాలని విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, సమగ్ర శిక్ష, ఇంటర్మీడియట్ విద్య ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. స్కూల్ ఎన్ రోల్ మెంట్ డ్రైవ్ ద్వారా ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రతిపాదించిన విధంగా గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమ వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ. విద్యార్థి ప్రాథమిక స్థాయిలోనే గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు. ఇటీవల విడుదల చేసిన పరాక్ సర్వేలో జిల్లా స్థాయి ర్యాంకులను, రాష్ట్రస్థాయి ర్యాంకులను మెరుగుపర్చేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అకడమిక్ ఫోరమ్ లను బలోపేతం చేసి, ఉపాధ్యాయులను ప్రేరేపించడం ద్వారా అభ్యసన ఫలితాలు మెరుగుపర్చాలని సూచించారు.

సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికను అత్యున్నత ప్రమాణాలతో పారదర్శకంగా చేపట్టాలి. ప్రతి హైస్కూల్ కి ఇంటర్నెట్ సదుపాయం కల్పించడంతో పాటు కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటుచేయాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ను పునర్ వ్యవస్థీకరించి నిపుణులను భాగస్వామ్యం చేయాలని, త్వరలోనే బోర్డ్ మీటింగ్ నిర్వహించాలని ఆదేశించారు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్(ATL) ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సమర్థవంతంగా స్టెమ్(STEM) యాక్టివిటీస్ చేపట్టాలని ఆదేశించారు.

రాష్ట్రంలో హైస్కూల్ ప్లస్ ల పనితీరుపై సమగ్రంగా చర్చించారు. హైస్కూల్ ప్లస్ వ్యవస్థ బలోపేతానికి చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలపై మంత్రి ఆరా తీశారు. అక్షర ఆంధ్ర(అఆ) కార్యక్రమాన్ని సమర్థంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీ చేయనున్న స్పోర్ట్స్ కిట్ ను మంత్రి పరిశీలించారు. విద్యార్థుల్లో పోటీతత్వం పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్య కమిషనర్ విజయరామరాజు, సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరక్టర్ బి.శ్రీనివాసరావు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కృతికా శుక్లా తదితరులు పాల్గొన్నారు

Tags:    

Similar News