Satavahana Collage : మరోసారి తెరమీదకి శాతవాహన కళాశాల వివాదం

టీడీపీ ఎమ్మెల్సీపై ఫిర్యాదు చేసిన కళాశాల ప్రిన్సిపల్‌;

Update: 2025-08-07 07:27 GMT

విజయవాడ శాతవాహన కళాశాల భూ వివాదం మరో సారి తెర మీదకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ తనను బెదిరిస్తున్నారని శాతవాహన కళాశాల ప్రిన్సిపల్‌ వంకాయలపాటి శ్రీనివాస్‌ విజయవాడ పోలీస్‌ కమిషనర్‌కి ఫిర్యాదు చేశారు. తనను బెదిరిస్తూ ఫోన్‌లో జరిగిన సంభాషణల రికార్డింగ్‌ క్లిప్‌ను విజయవాడ సీపీకి శాతవాహన కళాశాల ప్రిన్సిపల్‌ సాక్ష్యంగా సబ్‌మిట్‌ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి తరచు నాకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా ఫోన్‌ సీఐడీతో ట్యాపింగ్‌ చేయిస్తున్నని ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ బ్లాక్‌ మెయిల్‌కు పాల్డపుతున్నారని శ్రీనివాస్‌ ఆరోపిస్తున్నారు. గతంలో కూడా నా కుటుంబం మొత్తాన్ని చంపేస్తానని బెదిరించారని చెప్పారు. వారం క్రితం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ నాకు ఫోన్‌ చేసి నిన్ను వదలనని బెదిరించారని వాపోయారు. ఈ విషయంపై విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ని కలసి విన్నవించి తనకు రక్షణ కల్పించమని కోరానని తెలిపారు. గతంలో నన్ను కిడ్నాప్‌ చేసి గుంటూరులోని తన ఇంటికి తీసుకు వెళ్లారని, ఆ సమయంలో నా కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే అర్ధరాత్రి నన్ను పోలీసులు విడిపించారని గుర్తు చేశారు. శాతవాహన వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి దృష్టికి కూడా తీసుకు వెళ్ళానని ఆలపాటి నన్ను తీవ్రంగా బెదిరిస్తున్నారని ప్రిన్సిపల్‌ శ్రీనివాస్‌ చెప్పారు. శాతవాహన కళాశాల విషయంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీకి ఎటువంటి సంబంధం లేకపోయినా ఆయన చెప్పినట్లు వినాలని నన్ను బెదిరిస్తున్నారన్నారు. ఈ విషయంపై డీపీకీ కూడా ఫిర్యాదు చేశానని, ఆలపాటి నుంచి నన్ను రక్షించాలని శాతవాహన కళాశాల ప్రిన్సిపల్‌ వంకాయలపాటి శ్రీనివాస్‌ వేడుకుంటున్నారు. నాకు ఏమన్నా జరిగినట్లైతే అందుకు బాధ్యుడు ఆలపాటి రాజేంద్రప్రసాదే అని శ్రీనివాస్‌ స్పష్టం చేశారు.

Tags:    

Similar News