Bihar Elections: బిహార్ ఎన్నికలు: బీజేపీ 71 మంది అభ్యర్థులుతో తొలి జాబితా

బీజేపీ 71 మంది అభ్యర్థులుతో తొలి జాబితా

Update: 2025-10-14 11:14 GMT

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అధికారిక ప్రకటన: తారాపూర్ నుంచి సామ్రాట్ చౌదరి, లఖిసరాయ్ నుంచి విజయ్ సిన్హా పోటీ

Bihar Elections: బిహార్‌లో రాజకీయ ఉత్కంఠ రోజురోజుకొద్దీ పెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థి జాబితాలను వేగంగా ప్రకటిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మంగళవారం 71 మంది అభ్యర్థులతో తన తొలి లిస్ట్‌ను విడుదల చేసింది. ఎన్‌డీఏ కూటమి భాగంగా బీజేపీ ఈసారి 101 స్థానాల్లో పోటీ పడుతోంది. ఈ జాబితాలో ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా వంటి ప్రముఖుల పేర్లు చోటు చేసుకున్నాయి.

తారాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి పోటీ చేస్తారు. అలాగే, లఖిసరాయ్ నియోజకవర్గం నుంచి విజయ్ సిన్హా మళ్లీ పోటీ పడుతున్నారు. లఖిసరాయ్‌లో విజయ్ సిన్హా నాలుగుసార్లు విజయం సాధించిన మంచి రికార్డు ఉంది. 2005, 2010, 2015, 2020 ఎన్నికల్లో ఆయన వరుసగా గెలిచి ప్రజల ప్రాతినిధ్యం వహించారు. ఈ జాబితా ప్రకటనతో బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.

ప్రముఖ అభ్యర్థులు: మాజీ నేతలకు మరోసారి అవకాశాలు

ఈ తొలి జాబితాలో బీజేపీ సీనియర్ నేతలకు ప్రాధాన్యత ఇచ్చింది. మాజీ ఉప ముఖ్యమంత్రి రేణు దేవి బెట్టియా నుంచి, తారాకిషోర్ ప్రసాద్ కతిహార్ నుంచి, మంగళ్ పాండే సివన్ నుంచి, నితీష్ మిశ్రా ఝాన్జార్పూర్ నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే, నీరజ్ కుమార్ సింగ్ బబ్లూ చతర్పూర్, విజయ్ కుమార్ మండల్ సిక్తి, సంజయ్ సరావుగి దర్భంగా, రాణా రణ్‌ధీర్ సింగ్ మధుబన్, సునీల్ కుమార్ పింటు సీతామర్హి, నితిన్ నబిన్ బంకీపూర్, డాక్టర్ ప్రేమ్ కుమార్ గయ టౌన్, సిద్దార్థ్ సౌరవ్ బిక్రం నియోజకవర్గాల నుంచి టిక్కెట్లు దక్కాయి.

పార్టీ మహిళా అభ్యర్థులకు కూడా పెద్దగా స్థానాలు కేటాయించింది. ఈ జాబితాలో ఎనిమిది మంది మహిళలకు టిక్కెట్లు లభించాయి. వీరిలో శ్రేయాసి సింగ్ (జముయి), అరుణా దేవి (వర్సాలిగంజ్), రామ నిషద్ (ఆరైయ), నిషా సింగ్ (ప్రాణ్‌పూర్), కవిత దేవి (కొర్హా), స్వీటీ సింగ్ (కృష్ణ గంజ్), దేవాంతి యాదవ్ (నర్పట్‌గంజ్), గాయత్రి దేవి (పరిహార్) పేర్లు చోటుచేసుకున్నాయి.

అయితే, బిహార్ అసెంబ్లీ స్పీకర్ నంద్ కిషోర్ యాదవ్‌కు ఈసారి టిక్కెట్ దక్కలేదు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పాటలీపుత్ర నుంచి ఓటమి చవిచూసిన కేంద్ర మాజీ మంత్రి రామ్ కృపాల్ యాదవ్‌కు మాత్రం దానాపూర్ నియోజకవర్గం నుంచి అవకాశం కల్పించారు. ఈ జాబితా ప్రకటనతో బీజేపీ-ఎన్‌డీఏ కూటమి బలపడనుందని పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రధానంగా తన బలమైన ప్రాంతాల్లో ఫోకస్ చేస్తోంది. మరిన్ని జాబితాలు త్వరలోనే ప్రకటించనున్నారు. బిహార్ రాజకీయాల్లో ఈ అభ్యర్థి ఎంపికలు ఎలాంటి ప్రభావం చూపుతాయో అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.

Tags:    

Similar News