జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబుసోరెన్ కన్నుమూత
జెఎమ్‌ఎమ్ వ్యవస్ధాపకుడిగా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన శిబు సోరెన్
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్ధాపకుడు శిబు సోరెన్ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న 81 సంవత్సరాల శిబుసోరెన్ ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. సోమవారం ఉదయం 8.56 గంటలకు ఆయన మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. శిబు సోరెన్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఒకటిన్నర నెలల క్రితం గెండెపోటుకు గురయ్యారు. దాదాపు ఒక నెల పాటు లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌పై సోరెన్ వైద్య చికిత్స తీసుకుంటు కొనసాగుతున్నారు. 38 సంవత్సరాల క్రితం శిబుసోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా అనే రాజకీయ పార్టీని స్ధాపించి జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు చేశారు. ప్రస్తుతం జార్ఖండ్‌లో ఉన్న దుమ్కా లోక్‌సభ స్ధానం నుంచి ఎనిమిది సార్లు పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందారు. 2005లో పది రోజుల పాటు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన శిబుసోరెన్ 2008 నుంచి 2009, 2009 నుంచి 2010 వరకూ మూడు సార్లు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. శిబు సోరెన్ కు నలుగురు సంతానం. పెద్ద కుమారుడు హేమంత్ సోరెన్ ప్రస్తుతం జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.