VS Achuthanandan : కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ కన్నుమూత
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి;
కేరళ మాజీ ముఖ్యమంత్రి వెలిక్కకతు శంకరన్ అచ్యుతానందన్ ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. ఆయన వయసు 101 సంవత్సరాలు. గత నెల 24వ తేదీన ఆయనకు గుండెపోటు రావడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే చికిత్స పొందుతూ అచ్యుతానందన్ పరిస్ధితి విషయమించడంతో సోమవారం ఆయన తుది శ్వాస విడిచారు. అచ్చుతానందన్ 2006 నుంచి 2011 వరకూ కేరళ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాగే కేరళ అసెంబ్లీలో మూడు పర్యాయాలు ప్రతిపక్ష నేతగా కూడా ఆయన కొనసాగారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ చీలిక తరువాత సీపీయం పార్టీ స్ధాపకుల్లో అచ్చుతానందన్ ఒకరు. ప్రపంచ కమ్యూనిస్టు చరిత్రలో అనేక కీలక ఘట్టాలకు ప్రతక్ష సాక్షి అయిన అచ్చుతానందన్ 1923 అక్టోబర్ 20వ తేదీన కేరళలోని ఓ నిరుపేద కుటుంబంలో జన్మించారు. పేదరికంగా కారణంగా పలు దుకాణాల్లో, చిన్న చిన్న ఫ్యాక్టరీల్లో పని చేసిన అచ్యుతానందన్ చిన్న వయసులోనే కార్మిక ఉద్యమాల్లోకి అడుగుపెట్టారు. 1964వ సంవత్సరంలో సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యత్వాన్ని వదిలేసి సీపీఎం పార్టీని ప్రారంభించడంలో కీలక భూమిక పోషించారు. 1967వ సంవత్సరం నుంచి 2016 వరకూ అంటే 49 సంవత్సరాల పాటు ఆయన కేరళ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. కె.వసుమతి అనే ఆమెను అచ్యతానందన్ వివాహం చేసుకున్నారు. వీరికి వీవీఆశా అనే కుమార్తెతో పాటు వీఏఆరుణ్ కుమార్ అనే కుమారుడు ఉన్నారు.