Protective Shield Over Delhi Skies: దిల్లీ ఆకాశంపై రక్షణ కవచం.. ‘సుదర్శన చక్రం’కు కేంద్రం ఆమోదం!

‘సుదర్శన చక్రం’కు కేంద్రం ఆమోదం!

Update: 2025-12-30 11:33 GMT

Protective Shield Over Delhi Skies: దేశ రాజధాని దిల్లీలోని ముఖ్యమైన వీఐపీ ప్రాంతాల గగనతల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్వదేశీ సమీకృత ఎయిర్‌ డిఫెన్స్‌ వెపన్‌ సిస్టమ్‌ (IADWS) కొనుగోలుకు ఆమోద ముద్ర వేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీని విలువ సుమారు రూ.5,181 కోట్లు. డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థను ‘సుదర్శన చక్రం’ ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా పైలట్‌ ప్రాజెక్ట్‌గా దిల్లీలో మోహరించనున్నారు.

రాజధాని చుట్టూ 30 కిలోమీటర్ల పరిధిలో ఏర్పడే ఈ రక్షణ కవచం, డ్రోన్లు, క్షిపణులు, శత్రు యుద్ధ విమానాలు వంటి గగనతల ముప్పులను సమర్థవంతంగా అడ్డుకుంటుంది. సున్నిత ప్రాంతాల్లో డ్రోన్‌ దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల రూ.79 వేల కోట్ల విలువైన ఆయుధాల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెల్పిన నేపథ్యంలోనే ఈ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌కు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది.

ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ‘సుదర్శన చక్రం’ కార్యక్రమం దేశవ్యాప్తంగా కీలక ప్రాంతాలను గగనతల దాడుల నుంచి కాపాడే బహుళస్థాయి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. శత్రు దాడులను గుర్తించడమే కాకుండా, ప్రతిదాడి చేసే సామర్థ్యం, సైబర్‌ యుద్ధాన్ని తిప్పికొట్టే సాంకేతికత కూడా ఇందులో అనుసంధానమవుతుంది. డీఆర్‌డీవో, ప్రైవేటు రంగ సంస్థలు, సైనిక దళాల సమ్మిళిత ప్రయత్నాలతో ఈ మహా కార్యక్రమం సాకారమవుతోంది.

దిల్లీకి ఈ అభేద్య గగనతల కవచం ఏర్పాటుతో రాజధాని భద్రత మరింత దృఢమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News