Maharastra Politics : పదేళ్ళ తరువాత ఒక్కటైన ఉద్ధవ్‌, రాజ్‌ థాకరేలు

సీయం ఫడ్నవిస్‌ నిర్ణయమే వీరిద్దరి కలయికకు కారణం;

Update: 2025-07-05 11:13 GMT

మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. రెండు దశాబ్ధాలుగా ఎడ ముఖం పెడ ముఖంగా ఉన్న ఉద్ధవ్‌ థాకరే, మహరాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్‌ థాకరేలు ఒకే వేదికపైకి వచ్చారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ తీసుకున్న ఒక విధానపరమైన నిర్ణయం వీరిద్దరినీ కలిపింది. ప్రాధమిక విద్య స్ధాయిలో హిందీని తప్పని సరిగా మూడొవ భాషగా చేయాలని మహారాష్ట్ర సీయం దేవంద్ర ఫడ్నవిస్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉద్దవ్‌, రాజ్‌ థాకరేలను దగ్గర చేసింది. ఫడ్నవిస్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా ముంబయ్‌ వర్లీ ప్రాంతంలో జరిగిన ర్యాలీలో ఈ ఇద్దరు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. దీంతో ఇకపై ఉద్దవ్‌ థాకరే, రాజ్‌థాకరేల మధ్య రాజకీయంగా సత్సంబంధాలు నెలకొంటాయని మరాఠా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తమ మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలను పక్కన పెట్టి మహారాష్ట్ర ప్రయోజనాల కోసం భాషాను కాపాడుకోవడం కోసం కలసి రావడానికి సిద్దంగా ఉన్నామని ఇరువురు నేతలు సంకేతాలు ఇచ్చారు. బాలాసాహెబ్‌ థాకరే కనుక ఉంటే ఫడ్నవిస్‌ నిర్ణయాన్ని ఎట్టి పరిస్ధితుల్లో అంగీకరించే వారు కాదని, హిందీని ఈ విధంగా బలవంతగా ప్రాథమిక విద్య దశలో రుద్దడాన్ని తాము కూడా అంగీకరించే ప్రసక్తే లేదని ఉద్దవ్‌, రాజ్‌ థాకరేలు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి అధికారం చేపట్టడంతో థాకరే కుటుంబం దాదాపుగా రాజకీయంగా వెనుకబడ్డారు. ఉద్దవ్‌ నేతృత్వంలోని శివసేన కానీ రాజ్‌థాకరే నాయకత్వంలో ఉన్న మహరాష్ట్ర నవనిర్మాణ సేన కానీ రాజకీయంగా స్తబ్దత వాతావరణాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈదశలో వారికి అంది వచ్చిన అవకాశం ఫడ్నవిస్‌ హిందీ భాష నిర్ణయం. మరాఠాలు భాష విషయంలో చాలా సెంటిమెంటుగా ఉంటారు. ఈవిషయం మీద ఇప్పుడు పోరాటం చేస్తే అటు ఉద్దవ్‌ థాకరేకు, ఇటు రాజ్‌థాకరేకు మంచి మైలేజ్‌ వచ్చే అవకాశం ఉంది. ఈ పరిణామాన్ని ఊహించే ఉద్దవ్‌, రాజ్‌ థాకరేలిద్దరూ చేతులు కలిపారు. భవిష్యత్తులో కూడా ఇద్దరూ కలసి రాజకీయంగా ముందుకు సాగే అవకాశలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

రాజ్‌ థాకరే ఇటీవల ఒక పాడ్‌ కాస్ట్‌లో మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రజలకు మా మధ్య ఉన్న విభేదాలు పెద్ద సమస్యే కాదని, తేడాలు పక్కన పెట్టి మేమిద్దరం కలసి రావడం పెద్ద కష్టతరమైన విషయం కాదని మొదటి అడుగు వేశారు. ఉద్దవ్‌ థాకరే సైతం తన పార్టీ కార్మిక విభాగం సమావేశంలో మాట్లాడుతూ చిన్నచిన్న గొడవలు పక్కన పెట్టి మరాఠీ ప్రజల ప్రయోజనాల కోసం కలసి రావడానికి నేనూ సిద్దమే అంటూ తన సంసిద్ధతను పరోక్షంగా తెలియజేశారు. అయితే ముందు మహారాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిని ఇంటికి ఆహ్వానించి భోజనాలు పెట్టకుండా ఉండాలని సూచించారు.

మొత్తం మీద 2005వ సంవత్సరంలో మామ బాల్‌ థాకరే నుంచి విడిపోయి వేరుకుంపటి పెట్టుకున్న రాజ్‌ థాకరే పది సంవత్సరాల తరువాత తిరిగి తన మామ కుమారుడు ఉద్దవ్‌ థాకరేతో కలసి రాజకీయంగా ముందుకు నడవడానికి ముందడుగేశారు. ఈ పరిణామం శివసేన కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. అయితే వీరిద్దరి కలయిక మహరాష్ట్ర రాజకీయాలను ఏ విధమైన మలుపు తిప్పుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News