Group-1 Case: గ్రూప్-1 కేసు: వాదనలు పూర్తి.. జనవరి 22న తీర్పు
జనవరి 22న తీర్పు
Group-1 Case: తెలంగాణ గ్రూప్-1 ఫలితాల రద్దుపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ టీజీపీఎస్సీ మరియు ఎంపికైన అభ్యర్థులు సహా పలువురు దాఖలు చేసిన అప్పీళ్లపై హైకోర్టులో విచారణ పూర్తయింది. ఇరు పక్షాల వాదనలను విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరవింద్ (అపరేశ్‌కుమార్) సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం.. జనవరి 22న తీర్పు ప్రకటిస్తామని పేర్కొంది.
టీజీపీఎస్సీ తరఫున అడ్వకేట్ జనరల్ ఎ. సుదర్శన్ రెడ్డి వాదిస్తూ.. నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు పారదర్శకంగా నిర్వహించామని స్పష్టం చేశారు. మూల్యాంకనంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు ఇద్దరు వాల్యూయేటర్ల చేత మార్కులు ఇప్పించామని తెలిపారు. పరీక్ష కేంద్రాల సంఖ్య పెంచడం, పరిపాలనా సౌలభ్యం కోసం ప్రిలిమ్స్ మరియు మెయిన్స్‌కు వేర్వేరు హాల్‌టికెట్లు జారీ చేశామని వివరించారు. పరీక్షల్లో కాపీయింగ్ లేదా ఇతర అక్రమాలకు సంబంధించి ఎలాంటి ఆరోపణలు రాలేదని నొక్కి చెప్పారు.
అర్హత సాధించిన అభ్యర్థుల పక్షాన సీనియర్ న్యాయవాది డి. ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పరీక్షల్లో అర్హత పొందలేని వారే కోర్టును ఆశ్రయించారని అన్నారు. రెండు హాల్‌టికెట్ల విషయాన్ని పరీక్షలకు ముందే స్పష్టంగా తెలిపినప్పటికీ అప్పుడు అభ్యంతరం చెప్పకుండా, ఫలితాలు వెలువడిన తర్వాత పిటిషన్లు దాఖలు చేయడం సరికాదని వాదించారు.